TS News: నామినేటెడ్‌ పదవి ఇప్పిస్తానని రూ.15 లక్షలు టోకరా

నామినేటెడ్‌ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తానని రూ.15 లక్షలు తీసుకుని మోసగించిన వ్యక్తిని నాచారం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మల్లాపూర్‌ అన్నపూర్ణ కాలనీలో ఉంటున్న వేల్పుల శ్రీనివాస్‌ రియల్‌ వ్యాపారి.

Updated : 06 Oct 2021 06:58 IST

శ్రీధర్‌రావు, నిందితుడు

నాచారం, న్యూస్‌టుడే: నామినేటెడ్‌ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తానని రూ.15 లక్షలు తీసుకుని మోసగించిన వ్యక్తిని నాచారం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మల్లాపూర్‌ అన్నపూర్ణ కాలనీలో ఉంటున్న వేల్పుల శ్రీనివాస్‌ రియల్‌ వ్యాపారి. గతంలో కీసర మండలం రాంపల్లిదాయర సర్పంచిగా పని చేశారు. ఆయనకు వరంగల్‌కు చెందిన గనా యుగంధర్‌, శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. వీరికి  సికింద్రాబాద్‌ కవాడిగూడకు చెందిన శ్రీధర్‌రావుతో పరిచయం ఉంది. శ్రీధర్‌రావుకు తెరాసకు చెందిన ముఖ్య నాయకులతో సంబంధాలు ఉన్నాయని... మైన్స్‌ అండ్‌ జియాలజీ విభాగం లేదా వేర్‌ హౌసింగ్‌ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తామని వేల్పుల శ్రీనివాస్‌కు చెప్పారు. రూ.2 కోట్లు వరకు ఖర్చు అవుతుందన్నారు. అందుకు ఆయన అంగీకరించారు. 2019 జూన్‌ 4న మల్లాపూర్‌లోని శ్రీనివాస్‌ ఇంటికి ముగ్గురు కలిసి వచ్చారు. తొలి విడతగా ఆయన రూ.15 లక్షలు ఇచ్చాడు. రెండు నెలల్లోనే పదవి వస్తుందని.. పూర్తి మొత్తం చెల్లించాలని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏళ్లు గడుస్తున్నా పదవి రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాస్‌ కోరాడు. అడిగితే చంపుతామని శ్రీధర్‌రావు బెదిరించారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు 6న బాధితుడు నాచారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం శ్రీధర్‌రావును అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని