Crime News: తండ్రి, తనయుడి విషాదాంతం.. సీసాలో మిగిలిన విషం తాగి చిన్నారి మృతి

ఓ తండ్రి పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచాడు.. ఆ సీసాలో మిగిలిన మందును శీతల పానీయం అనుకొని తాగిన మూడేళ్ల కుమారుడూ కన్నుమూయగా..ఐదేళ్ల కుమార్తె

Updated : 04 Oct 2021 09:24 IST

అప్పుల బాధతో పురుగుల మందు తాగిన కార్పెంటర్‌

కుమార్తె పరిస్థితి విషమం

తపట్నం, న్యూస్‌టుడే: ఓ తండ్రి పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచాడు.. ఆ సీసాలో మిగిలిన మందును శీతల పానీయం అనుకొని తాగిన మూడేళ్ల కుమారుడూ కన్నుమూయగా..ఐదేళ్ల కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని ఆనెం వీధికి చెందిన మేడిపాకల వెంకటరమణ(28) కార్పెంటర్‌గా పనిచేసేవారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక గురువారం సాయంత్రం శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శుక్రవారం వెంకటరమణ మృతి చెందారు. వెంకటరమణ తాగిన సీసా ఇంట్లో పడేయడంతో అతడి కుమారుడు నిహాల్‌(3), ఐదేళ్ల కుమార్తె యామిని శీతలపానీయం అనుకొని తాగారు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి కాస్తా మెరుగు పడటంతో వైద్యులు పిల్లలను ఇంటికి పంపించారు. శనివారం మధ్యాహ్నం తరువాత పిల్లలకు వాంతులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం నిహాల్‌ ప్రాణాలు విడిచాడు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని