Updated : 30 Oct 2021 11:19 IST

Crime News: అబద్ధాలు చెప్పి హైదరాబాద్‌ యువతితో పాకిస్థానీ వివాహం.. 

ఆరేళ్ల కుమార్తెతో అసభ్య ప్రవర్తన

ఈనాడు, హైదరాబాద్‌: అతడో పాకిస్థానీ.. పేరు మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌. సందర్శకుల వీసా మీద దుబాయ్‌లో కచేరీలు చేస్తుంటాడు. హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లో నివసించే ఓ యువతి కూడా దేశవిదేశాల్లో పాటలు పాడుతుంటారు. తొమ్మిదేళ్ల క్రితం ఇక్రమ్‌ ఆమెకు దుబాయ్‌లో పరిచయమయ్యాడు. తాను దిల్లీకి చెందిన ముస్లింగా పరిచయం చేసుకున్న అతడు పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించగా.. ఆమె అంగీకరించారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకున్న నెల రోజుల్లోనే అతనూ ఇక్కడికి వచ్చాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇందుకోసం ఆమె ఇస్లాం మతంలోకి మారింది. చాదర్‌ఘాట్‌లో కాపురం పెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఆమె దిల్లీలోని అత్తారింటికి వెళ్దామని అడిగింది. అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. తాను పాకిస్థాన్‌వాసినని, సందర్శకుల వీసాతో వచ్చానని చెప్పాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పట్నుంచి తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. భర్తతో భయంభయంగానే కలిసి జీవిస్తోంది ఆమె. వారికి ఓ కుమార్తె జన్మించింది. చాదర్‌ఘాట్‌లోనే నివసించే నిజాం ఖాజా ద్వారా ఆధార్‌ కార్డు, వరంగల్‌లో ఉంటున్న అతడి స్నేహితుడి ద్వారా పది, ఇంటర్‌ ధ్రువపత్రాలను సమకూర్చుకున్నాడు. వాటిని ముంబయిలో రాష్ట్రీయ విద్యాపీఠ్‌ పేరుతో నకిలీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రమేష్‌ మూలేకి పంపి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ పట్టాను రూ. 10 వేలకు కొన్నాడు. అవే నకిలీ పత్రాలతో ఏడేళ్ల కిందట భారత పాస్‌పోర్టు తీసుకున్నాడు.

ఇలా బయటపడింది..

ఆరేళ్ల వయసున్న కుమార్తె పట్ల అబ్బాస్‌ అసభ్యంగా ప్రవర్తించడాన్ని చూసి సహించలేక భార్య మూడేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌, 2018 జులైలో నిందితుణ్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. అతడి ఇంట్లో జరిపిన తనిఖీల్లో పాక్‌ పాస్‌పోర్టు లభించడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆధార్‌ కార్డు, ధ్రువపత్రాలు నకిలీవని తేలింది. పాస్‌పోర్టును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించగా.. అతను పాకిస్థాన్‌ పౌరుడేనని ధ్రువీకరించింది. గతేడాది అక్టోబరులో విచారణ ప్రారంభించిన నాంపల్లి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అతడికి నకిలీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ ధ్రువపత్రం ఇచ్చిన రమేష్‌ మూలేకూ ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts