AP News: మార్కాపురంలో అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యం

ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో నిన్న అపహరణకు గురైన ఐదు రోజుల శిశువు

Updated : 29 Aug 2021 10:23 IST

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో నిన్న అపహరణకు గురైన ఐదు రోజుల శిశువు ఆచూకీ లభ్యమైంది. మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శిశువు దగ్గరున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి పాపను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

అసలేం జరిగిందంటే..

ఈ నెల 24న గుంటూరు జిల్లా బట్టువారిపాలెం గ్రామానికి చెందిన కోమలి అనే మహిళ మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామానికి చెందిన తన పుట్టింటి నుంచి కాన్పు కోసం వైద్యశాలకు వచ్చారు. అదే రోజు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిచ్చారు. శిశువుకు కామెర్లు ఉన్నాయని ఇంక్యుబేటర్‌లో పెట్టాలని వైద్యులు సూచించడంతో శనివారం మధ్యాహ్నం ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్లు ఉన్న గదికి వెళ్లి పాపను అక్కడి సిబ్బందికి అప్పగించారు. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రి సిబ్బంది వచ్చి పాప కనిపించడం లేదని తల్లిదండ్రులకు తెలిపారు. ఆందోళన చెంది ఆసుపత్రి అంతా వెదికారు. చివరికి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. బుర్కా వేసుకున్న మహిళ పాపను ఎత్తుకెళ్లిన దృశ్యాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు నాలుగు బృందాలు రంగంలోకి దిగి శిశువు ఆచూకీని కనుగొన్నాయి. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని