AP News: నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్టు

పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దేవేంద్ర కుమార్ తెలిపిన..

Updated : 14 Jul 2021 13:53 IST

తిరుపతి నేరవార్తలు: పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దేవేంద్ర కుమార్ తెలిపిన వివరాల మేరకు.. విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ తిరుపతిలోని మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడే పని చేస్తున్న సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని ఆమె అతనికి చేరువైంది. అనంతరం సునీల్ వాళ్లింట్లో ఒప్పించి సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమెకు 10 తులాల బంగారం పెట్టారు. 

కొన్ని రోజుల తర్వాత తనను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి అవసరమని భర్త, అత్తమామల నుంచి రూ.6 లక్షలు తీసుకుంది. కొన్నాళ్లకు ఈ ఏడాది జూన్‌లో డబ్బు గురించి భర్త ఆమెను ప్రశ్నించిగా మరుసటి రోజే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై భర్త అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో నెల్లూరుకు చెందిన మేనమామతో సుహాసినికి గతంలో వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

సునీల్‌ తన గురించి ఆరా తీస్తున్నాడని తెలుసుకున్న సుహాసిని అతనికి ఫోన్ చేసి తనకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయినట్లు చెప్పింది. అవాక్కైన అతను ఈ విషయాన్ని పోలీసులతో పాటు మీడియాకు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుహాసినిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ మహిళ బాధితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వినయ్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొదటి భర్త సహకారంతోనే ఈ తరహా మోసాలకు సదరు మహిళ పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని