Crime News: గుంటూరు జిల్లాలో నడి రోడ్డుపై  అత్యంత పాశవిక దాడి

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో ఓ వ్యక్తిపై అత్యంత పాశవికంగా దాడి  చేయడం కలకలం రేపింది. ఓ వ్యక్తిని  రోడ్డు డివైడర్‌పై పడేసి  కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు

Published : 25 Nov 2021 02:00 IST

పిడుగురాళ్ల:  గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో ఓ వ్యక్తిపై అత్యంత పాశవికంగా దాడి  చేయడం కలకలం రేపింది. ఓ వ్యక్తిని  రోడ్డు డివైడర్‌పై పడేసి  కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు పట్టుకోగా మరో వ్యక్తి కిరాతకంగా బండరాయితో మోదాడు. దెబ్బలు తాళలేక బాధితుడు విలవిల్లాడుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా చావబాదారు.  ఇనుప రాడ్లు, జాకీలతోనూ విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు.  ఈఘటనలో గాయపడిన వ్యక్తిని సైదాగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   దాడి ఘటన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

బాధితుడి కథనం ప్రకారం...  పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా వివాహ వేడుకకు హాజరై ద్విచక్రవాహనంపై  తిరిగి వస్తుండగా.. పిడుగురాళ్ల శివారులోకి రాగానే  ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్‌రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన   పలువురు  దాడికి పాల్పడ్డారు.  పార్టీల పరంగా  పాతకక్షలు , పొలం గట్ల వివాదంలో  గొడవల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపారు. నడిరోడ్డుపై దాడి జరుగుతున్నా .. అటుగా వెళ్తున్న వారు చూస్తుండిపోయారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదని బాధితుడు వాపోయాడు. 

సైదాపై దాడిని ఖండించిన లోకేశ్‌, అచ్చెన్నాయుడు

గుంటూరుజిల్లా పిడుగురాళ్ల శివారులో  సైదాపై అత్యంత పాశవికంగా జరిగిన దాడిని  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు.  తెదేపా కార్యకర్త సైదాపై వైకాపా  రౌడీ మూకలు నరరూప రాక్షసులకంటే  ఘోరంగా దాడి చేశాయని  లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం తగాదా సాకుతో వైకాపా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. తెదేపా ఏజెంట్‌గా పనిచేశారనే కక్షతోనే దాడి చేశారని ఆరోపించారు.  పోలీసుల తీరుతో వైకాపా మూకలు బరితెగిస్తున్నాయన్నారు.

సైదాపై దాడి వైకాపా ఆకృత్యాలకు నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు. నాలుగు రోజుల క్రితం దాడి జరిగినా కేసు పెట్టరా అని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది కాపాడటానికా? దాడులు చేయించటానికా అని నిలదీశారు.  సైదాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు.  సైదా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని