
Crime News: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం: నలుగురి మృతి
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. రంపచోడవరం మండలం ఐ.పోలవరం కాలువ వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. రంపచోడవరం సీఐ త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. జాగరంపల్లి గ్రామానికి చెందిన కోడి రమేశ్, కోసు శేఖర్లు సీతపల్లిలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరుగు పయనమయ్యారు. ఈక్రమంలో గంగవరం మండలం జీఎం పాలెం గ్రామానికి చెందిన చోడి రాజబాబు, పండు అనే ఇద్దరు యువకులు రంపచోడవరం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ రెండు వాహనాలు ఐ.పోలవరం కాలువ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శేఖర్, రమేశ్, పండు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజబాబు మృతి చెందాడు. వీరంతా వ్యవసాయ కూలీలు. ప్రమాదఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.