Ts News: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసు.. కెనరా బ్యాంకు కీలక నిర్ణయం

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో పురోగతి చోటు చేసుకుంది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. రెండు మూడు ....

Updated : 16 Dec 2021 13:46 IST

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో పురోగతి చోటు చేసుకుంది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. రెండు మూడు రోజుల్లో తెలుగు అకాడమీ ఖాతాలో రూ.10 కోట్లను డిపాజిట్ చేసే అవకాశం ఉంది. తెలుగు అకాడమీకి సంబంధించిన రూ. 10కోట్లను చందానగర్‌లోని కెనరా బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి డిపాజిట్ చేశారు. బ్యాంకు మేనేజర్ సాధనతో చేతులు కలిపిన నిందితులు నకిలీ పత్రాలు సమర్పించి డిపాజిట్‌ను ఇతర బ్యాంకుకు మళ్లించి విడతలవారీగా నగదును విత్ డ్రా చేసుకున్నారు.

బ్యాంకు మేనేజర్ హస్తంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్‌ను ఇతర ఖాతాలోకి మళ్లించిన వైనాన్ని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు, తెలుగు అకాడమీ అధికారులు కెనరా బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చర్యలు చేపట్టిన బ్యాంకు ఉన్నతాధికారులు.. రూ.10 కోట్లు తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు. బ్యాంకు ఉన్నతాధికారులు అడిగిన పత్రాలను తెలుగు అకాడమీ అధికారులు సమర్పించారు. అలాగే యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులతోనూ తెలుగు అకాడమీ అధికారులు సమావేశమయ్యారు. కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖలో రూ.40 కోట్లు, సంతోష్ నగర్ శాఖలో ఉన్న రూ. 13 కోట్లను నకిలీ పత్రాలు సృష్టించి చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ సహకారంతో కొల్లగొట్టారు. ఈ విషయాన్ని తెలుగు అకాడమీ అధికారులు యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని