Crime News: లంచం తీసుకున్న వ్యవహారంలో జుడిషియల్‌ రిమాండ్‌కు కస్టమ్స్‌ అధికారులు

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కస్టమ్స్‌ అధికారులను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీబీఐ ప్రకటించింది. నిన్న బషీర్‌బాగ్‌ కస్టమ్స్‌

Published : 27 Oct 2021 01:04 IST

హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కస్టమ్స్‌ అధికారులను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీబీఐ ప్రకటించింది. నిన్న బషీర్‌బాగ్‌ కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంలో ప్రివెన్షన్‌ విభాగానికి చెందిన ఇద్దరు కస్టమ్స్‌ అధికారులు రూ. 10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టు అయిన నిందితుడు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే అతను ప్రతి నెల రెండు, నాలుగో సోమవారం కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంలో హాజరై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిందితుడు హాజరు కాకపోవడంతో షరతులు పాటించడం లేదని.. ఇలా అయితే బెయిల్‌ రద్దు అవుతుందని కస్టమ్స్‌ అధికారులు హెచ్చరించారు. దీంతో నిందితుడు బెయిల్‌ రద్దు కాకుండా చూడాలని కస్టమ్స్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రూ.20వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో.. చివరకు రూ.10వేలకు ఒప్పందం కుదిరింది.

అదే విషయాన్ని నిందితుడు సీబీఐకి సమాచారం ఇచ్చాడు. నిన్న సాయంత్రం కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంలో నిందితుడు లంచం ఇస్తుండగా సీబీఐ అధికారులు దాడులు చేసి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంతో పాటు వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వారిద్దరినీ ఇవాళ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా.. వారికి న్యాయస్థానం జుడిషియల్‌ రిమాండ్‌ విధించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని