Viveka murder case: వివేకా హత్యకు ముందు ఆయన ఇంట్లో కుక్కను చంపారు: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఎట్టకేలకు మరో నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ కీలక ఆధారాలను..

Published : 10 Sep 2021 01:58 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఎట్టకేలకు మరో నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. సింహాద్రిపురం మండలం కుంచేకులవాసి ఉమాశంకర్‌రెడ్డిని ఉదయం నుంచి విచారించిన అధికారులు సాయంత్రం అరెస్టు చేసి పులివెందుల కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్భంగా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఉమాశంకర్‌రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.

రిమాండ్‌ రిపోర్టులోని అంశాలు...
‘‘వివేకా హత్యకేసులో సునీల్‌, ఉమాశంకర్‌ పాత్రపై ఆధారాలు ఉన్నాయి. హత్యకేసులో ఇద్దరి కుట్రకోణం ఉంది. ఉమాశంకర్‌ పాత్రపై సునీల్‌ విచారణలో చెప్పారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఉమాశంకర్‌ పాత్ర ఉందని తెలిపాడు. వివేకా హత్యకు ముందే ఆయన ఇంట్లో కుక్కను చంపారు. సునీల్‌, ఉమాశంకర్‌ కలిసి కారుతో ఢీకొట్టి కుక్కను చంపారు. హత్య చేయడానికి ఉమాశంకర్‌, సునీల్‌ బైక్‌పై వెళ్లారు. ఉమాశంకర్‌ బైక్‌లో గొడ్డలి పెట్టుకొని పారిపోయాడు. బైక్‌, గొడ్డలి స్వాధీనం చేసుకున్నాం. గుజరాత్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక తెప్పించాం. గతనెల 11న ఉమాశంకర్‌ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకున్నాం. మరి కొందరు నిందితులను పట్టుకోవాల్సి ఉంది. ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని’’ అని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.

ఎవరీ ఉమాశంకర్‌రెడ్డి?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం కలకలం రేపింది. ఉమాశంకర్‌రెడ్డి స్వస్థలం సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామం. వైఎస్‌ వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి.  ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈనెల 23వరకు రిమాండ్‌ విధించింది. దీంతో అతన్ని పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని