TS News: కార్వీ మోసాలపై రెండో రోజూ ఆరా.. సరైన సమాధానాలు చెప్పని పార్థసారథి

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల గురించి ఆ సంస్థ ఛైర్మన్ పార్థసారథిని సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్) పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ...

Updated : 26 Aug 2021 15:11 IST

హైదరాబాద్‌: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల గురించి ఆ సంస్థ ఛైర్మన్ పార్థసారథిని సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్) పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా రెండో రోజు అతను చేసిన మోసాలపై కూపీ లాగుతున్నారు. కర్ణాటక, పంజాబ్, దిల్లీలోనూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థలైన కార్వీ రియాల్టీ, కార్వీ వెల్త్ సంస్థలపై కేసులు నమోదయ్యాయి. పార్థసారథిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్న విషయం తెలుసుకున్న ఆయా రాష్ట్రాల పోలీసులు, కేసు వివరాలు తెలుసుకునేందుకు సీసీఎస్ పోలీసులను సంప్రదించారు.

బెంగళూరులోని బసవనగుడి పోలీసులు కార్వీ రియాల్టీ సంస్థపై రెండేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించి రూ.4 కోట్లకు పైగా మదుపు చేయించి మోసం చేసిన కేసులో పార్థసారథితో సహా 13 మందిపై అక్కడ కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు సైతం ఫోన్‌ ద్వారా సీసీఎస్ పోలీసులకు సంప్రదించి.. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఎన్ని రాష్ట్రాల్లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ మోసాలకు పాల్పడిందనే విషయాలను పార్థసారథి వద్ద ప్రస్తావించారు. దీనికి ఆయన సరైన సమాధానం చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని నిన్న కస్టడీలోకి తీసుకొని నాంపల్లిలోని సీసీఎస్ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని