Crime News: చెడ్డీ గ్యాంగు అరెస్టు..గుజరాత్‌లో దొరికిన ముగ్గురు దొంగలు

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడి హడలెత్తించిన చెడ్డీ గ్యాంగును పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నగర కమిషనరేట్‌ నుంచి బృందాలు గుజరాత్‌ వెళ్లి ముగ్గురిని అరెస్టుచేసి, నగరానికి తీసుకొచ్చారు

Updated : 18 Dec 2021 12:35 IST

చోరీ సొత్తు రికవరీ

ఈనాడు, అమరావతి: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడి హడలెత్తించిన చెడ్డీ గ్యాంగును పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నగర కమిషనరేట్‌ నుంచి బృందాలు గుజరాత్‌ వెళ్లి ముగ్గురిని అరెస్టుచేసి, నగరానికి తీసుకొచ్చారు. గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా గుల్చర్‌ గ్రామానికి చెందిన మడియా కాంజీ మేడా, సక్ర మండోడ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్‌ బాబేరియా అలియాస్‌ కమలేష్‌ అలియాస్‌ కమ్లా జుబువాలను అరెస్టుచేశారు. మిగిలినవారి కోసం ఓ బృందం అక్కడ అన్వేషిస్తోంది. వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా విలేకర్లకు వెల్లడించారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన తూర్పు మండల డీసీపీ హర్షవర్ధన్‌ రాజు, సీసీఎస్‌ ఇన్‌ఛార్జి కొల్లి శ్రీనివాస్‌, పశ్చిమ ఏసీపీ హనుమంతరావులను ఆయన అభినందించారు.

తాగిన మత్తులో నిర్ణయం: గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా గుల్చర్‌ గ్రామం, మధ్యప్రదేశ్‌లోని జుబువాకు చెందిన పదిమంది దొంగలు నవంబరు 22న ఓ పెళ్లివిందులో కలిశారు. మద్యం తాగిన వీరు దక్షిణాదిలో చోరీలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి చెన్నైలో దిగారు. అక్కడినుంచి రైలులో 28న విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఐదుగురి చొప్పున రెండు ముఠాలుగా విడిపోయి దొంగతనాలకు పాల్పడ్డారు. పగలు రెక్కీ చేసి, తెల్లవారుజామున దొంగతనాలు చేస్తారు. ఎవరైనా ఎదురుతిరిగితే దాడి చేసేందుకు, తలుపులు పగలగొట్టేందుకు పెద్దకర్రలు, రాడ్లు తీసుకెళ్తుంటారు. వీరు గత నెల 29 నుంచి ఈ నెల 8 వరకు పలు ప్రాంతాల్లో చోరీలు చేసి గుజరాత్‌ వెళ్లిపోయారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు: సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుల ఫొటోలను పోలీసులు సిద్ధం చేశారు. గుజరాత్‌కు చెందిన చెడ్డీగ్యాంగు పనిగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే దాహోద్‌ జిల్లా ఎస్పీని సంప్రదించి, అక్కడికి విజయవాడ నుంచి రెండు బృందాలను పంపారు. చెడ్డీగ్యాంగు సభ్యులు అక్కడికి వెళ్లేసరికే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. చోరీ చేసిన చొత్తుతో సహా ముగ్గురిని పట్టుకున్నారు. మిగిలిన ఏడుగురు పరారయ్యారు. దొరికిన వారి నుంచి రూ.20వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని