
Cyber Crime: లింక్‌లు పంపి.. రూ.37 లక్షలు లాగేశారు
నారాయణగూడ, న్యూస్‌టుడే: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఓ వ్యాపారి రూ.21 లక్షలు మోసపోయారు. మంగళవారం హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటాద్రి కథనం ప్రకారం.. ముషీరాబాద్‌లోని ఆజామాబాద్‌కు చెందిన వ్యాపారి వాట్సాప్‌కు ఎస్‌క్యూ.కామ్ అనే యాప్‌కు సంబంధించిన లింక్ వచ్చింది. క్లిక్ చేసి చూడగా.. పెట్టే పెట్టుబడికి రెండు, మూడింతలు లాభాలు వచ్చేలా చేస్తామని ఉంది. మొదటి ప్రయత్నంగా రూ.2 వేలు పెట్టగా, సాయంత్రానికి రూ.4 వేలు వచ్చాయి. తర్వాత రూ.లక్ష పెడితే, రూ.2.62 లక్షలు అయ్యాయి. ఆన్‌లైన్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతోంది. మరింత పెట్టుబడి పెట్టండని చెప్పడంతో వ్యాపారి విడతల వారీగా రూ.21 లక్షలు పెట్టగా, దానికి రూ.50 లక్షలు లాభం వచ్చినట్లు యాప్‌లో కనిపిస్తోంది. కానీ విత్‌డ్రా ఆప్షన్ కనిపించలేదు. అవతలి వ్యక్తి అందుబాటులోలేకుండా పోయాడు. తర్వాత యాప్ కూడా మాయమైంది. ఇదే తరహాలో యూసుఫ్‌గూడ, బండ్లగూడకు చెందిన ఇద్దరు మహిళలతో ఈబే యాప్, ఎంజెడ్‌హెచ్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లో పెట్టుబడులు పెట్టించి రూ.8 లక్షల చొప్పున కాజేశారు సైబర్ కేటుగాళ్లు. బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.