Cyber Crime: కొన్నకొద్దీ లాభం వస్తుందని రూ.66,580 కొట్టేశాడు

వంద రూపాయలు ఖాతాలో వేసి ఓ వస్తువు కొంటే లాభం వస్తుందని నమ్మించాడు.

Published : 14 Sep 2021 11:57 IST

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: వంద రూపాయలు ఖాతాలో వేసి ఓ వస్తువు కొంటే లాభం వస్తుందని నమ్మించాడు. మళ్లీ కొనుగోలు చేయాలంటూ సూచించాడు. చివరకు భారీగా టోకరా వేశాడు ఓ సైబర్‌ కేటుగాడు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. షేక్‌పేట ఎన్‌ఎస్‌ఎఫ్‌ కాలనీలో నివసించే ప్రైవేటు ఉద్యోగి అబ్దుల్‌ సత్తార్‌ ఉద్యోగం కోసం అంతర్జాలంలో అన్వేషించారు. ఆదివారం ఈబే988.కామ్‌ను క్లిక్‌ చేశాడు. వెంటనే చరవాణికి ఒక వాట్సాప్‌ నంబరు నుంచి సంబంధిత వెబ్‌సైట్‌ వినియోగదారుల సేవా కేంద్రం నుంచి సందేశం వచ్చింది. ఓ వ్యక్తి మాట్లాడుతూ.. రోజుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు సులభంగా సంపాదించవచ్చని నమ్మించాడు. సత్తార్‌తో రూ.వందతో యాప్‌లోని వస్తువు కొనుగోలు చేయాలని సూచించాడు. కప్పులు కొనుగోలు చేయగా రూ.110 జమయ్యాయి. ఎంత కొంటే అంత ఎక్కువ నగదు వస్తుందని చెప్పడంతో అయిదారు లావాదేవీలు చేశారు. రూ.680తో వస్తువు కొనుగోలు చేశారు. డబ్బు తిరిగి రాకపోగా బ్యాంకు ఖాతా నిలిచిపోయింది. సంస్థ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించగా.. మరో అయిదు కొనుగోళ్లు చేస్తే ఖాతా తెరుచుకుంటుందని చెప్పడంతో గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ.55,000 విలువైన వస్తువులు కొనుగోలు చేశారు. అయినా ఖాతా తెరుచుకోలేదు. మొత్తం రూ.66,580 మోసపోయినట్లు గ్రహించి సోమవారం బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని