UP: దళిత బాలికను బంధించి.. కాళ్లపై కొడుతూ..

ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం అభాండాన్ని మోపుతూ ఓ దళిత బాలికను ఓ కుటుంబం చిత్రహింసలు పెట్టింది......

Updated : 30 Dec 2021 05:56 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం అభాండాన్ని మోపుతూ ఓ దళిత బాలికను ఓ కుటుంబం చిత్రహింసలు పెట్టింది. ఆ అభాగ్యురాలిపై ఇష్టారీతిన దాడి చేశారు. దొంగతనం ఎందుకు చేశావంటూ.. బాలికను ఇంట్లో కింద పడుకోబెట్టి కాళ్లను ఓ కర్రపై పెట్టి మరో కర్రతో కొడుతూ అత్యంత కఠినంగా వ్యవహరించిన ఓ వీడియో షాక్‌కు గురిచేస్తోంది. నొప్పితో బాలిక విలవిల్లాడుతూ రోదిస్తున్నా ఎలాంటి కనికరం చూపలేదు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కూడా నిందితులకు వంతుపాడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై అమేఠీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దళిత బాలికపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ ప్రధాన నేత ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ వీడియోను ట్వీట్‌ చేస్తూ.. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిరోజు 34 కులపరమైన నేరాలు, మహిళలపై 135 నేరాలు నమోదవుతున్నప్పటికీ.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగం నిద్రపోతోందని మండిపడ్డారు. ఈ కేసులోని బాధ్యులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే ఆందోళనకు దిగుతామని యూపీ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.

అమేఠీ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అర్పిత్‌ కపూర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ కింద పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన నమన్‌ సోని అనే వ్యక్తిని అరెస్టు చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని