Crime News: వాగులో కొట్టుకుపోయిన కార్ల ఘటన.. 3 మృతదేహాల గుర్తింపు

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారులో

Updated : 13 Sep 2023 16:23 IST

మర్పల్లి‌: వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారులో కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్రుతి మృతదేహాలను గుర్తించారు. డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, బాలుడు త్రిషాంత్‌ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మరోవైపు శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వాగులో కోట్టుకుపోయిన కారులో ఉన్న వృద్ధుడు వెంకటయ్య(70) మృతదేహం కూడా లభ్యమైంది.

అసలేం జరిగిందంటే.. 

మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్రుతి, ఓ బాలుడు, మరో బంధువు రాఘవేందర్‌రెడ్డి రావులపల్లికి కారులో బయలుదేరారు. తిమ్మాపూర్‌ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చిన్న వాగే కదా అని వారు ముందుకు సాగారు. నీటి ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. పెళ్లి కుమారుడు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్‌  తెరిచి కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.

చేవెళ్ల మండలం కౌకుంట్లలో శుభకార్యంలో పాల్గొనేందుకు మోమిన్‌పేట్‌ మండలం ఎన్కెతల గ్రామానికి చెందిన సామల వెంకటయ్య(70), సాయి, ఎస్‌.శ్రీనివాస్‌ మధ్యాహ్నం వచ్చారు. వ్యక్తిగత పనుల కోసం కౌకుంట్లకు చెందిన బంధువులైన రమేశ్‌, ఎ.శ్రీనివాస్‌తో కలసి కారులో ఎన్కెపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా డ్రైవర్‌ అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. కారు కొట్టుకుపోగా.. సాయి, రమేశ్‌, ఎ.శ్రీనివాస్‌, ఎస్‌.శ్రీనివాస్‌లు సురక్షితంగా బయటపడ్డారు. దివ్యాంగుడైన వెంకటయ్య కారులోంచి బయటకు రాలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని