Karvy Stock Broking case: పీటీ వారెంట్‌పై హైకోర్టును ఆశ్రయించిన పార్థసారథి

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరు పోలీసుల పీటీ వారెంట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు..

Updated : 22 Sep 2021 15:04 IST

హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరు పోలీసుల పీటీ వారెంట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 8న బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌లో పార్థసారథిపై కేసు నమోదైంది. రూ.109 కోట్ల మోసం కేసులో పార్థసారధితో పాటు కార్వీ సీఈవో రాజీవ్‌ రంజన్‌, సీఎఫ్‌వో కృష్ణపై కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై మూడు రోజుల కస్టడీకి బెంగళూరు పోలీసులు అనుమతి కోరగా.. నాంపల్లి కోర్టు అనుమతించింది. అనారోగ్యం కారణంగా బెంగళూరు పోలీసుల విచారణకు హాజరుకాలేనని పార్థసారథి పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పీటీ వారెంట్‌ రద్దు చేసింది. పార్థసారథి ప్రస్తుతం హైదరాబాద్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

కార్వీ స్టాక్ బ్రోకింగ్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఉదయం నుంచి నగరంలోని పలు కార్వీ కార్యాలయాలతో పాటు వాటి అనుబంధ సంస్థల్లో ఏక కాలంలో ఈడీ సోదాల చేస్తోంది. బంజారాహిల్స్, నానక్‌రాంగూడా, అమీర్‌పేట్‌ సహా మొత్తం ఎనిమిది చోట్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రతతో ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే మాజీ ఎండీ పార్థసారథిని చంచల్‌గూడా జైల్లో మూడు రోజులపాటు విచారించిన ఈడీ మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో సీసీఎస్ పోలీసులు పార్థసారథితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నుంచి రూ.కోట్లల్లో అక్రమంగా రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుంభకోణంలో ముఖ్యంగా మనీలాండరింగ్ జరిగిందని గుర్తించిన ఈడీ.. కార్వీ కార్యాలయాల్లో సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరిచుకుంది. ఈ కేసులో సోదాల అనంతరం మరికొంత మందిని ఈడీ విచారించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని