Enforcement Directorate: 40 డొల్ల కంపెనీలకు రూ.1,500 కోట్లు తరలింపు: ఈడీ

విదేశాలకు దొడ్డిదారిన సొమ్ము తరలించిన కేసులో.. రూ. 18.67 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. కాకా గ్రూప్, శశి గోయెల్,

Updated : 18 Aug 2021 05:48 IST

హైదరాబాద్‌: విదేశాలకు దొడ్డిదారిన సొమ్ము తరలించిన కేసులో.. రూ. 18.67 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. కాకా గ్రూప్, శశి గోయెల్, ప్రగతి ప్రింట్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న వ్యవసాయ, వాణిజ్య ఆస్తులను తమ అధీనంలోకి తీసుకుంది. వడ్డీ మహేష్ అనే వ్యక్తిపై విశాఖలో గతంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీకే గోయెల్ అనే వ్యాపారి ఈ మనీలాండరింగ్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా ఈడీ తేల్చింది. బీకే గోయల్ సూచనలతో విశాఖకు చెందిన వడ్డీ మహేష్ సింగపూర్, చైనా, హాంకాంగ్‌లో 40 డొల్ల కంపెనీలు సృష్టించినట్లు ఈడీ తెలిపింది. బీకే గోయల్ భార్య శశి గోయెల్, కుమారుడు రాహుల్ పేరిట కూడా విదేశాల్లో కొన్ని కంపెనీలు సృష్టించిట్లు దర్యాప్తులో తేలింది. ఆయూష్ గోయెల్, వికాస్ గుప్తా, వినీత్ గోయెంకా ద్వారా వడ్డీ మహేష్‌కు బీకే గోయెల్ నిధులు, వివరాలను పంపిస్తున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.

‘‘మహేష్ విదేశాల్లో కంపెనీలు సృష్టించడంతో పాటు.. హైదరాబాద్, విశాఖపట్నం, కోల్‌కతాలోని పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాడు. అనుమానం రాకుండా ఉండేందుకు బీకే గోయెల్ నుంచి వడ్డీ మహేష్‌కు సొమ్ము నేరుగా పంపకుండా.. నాలుగైదు బ్యాంకుల లావాదేవీల తర్వాత మళ్లించారు.  సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల పేరిట రశీదులు సృష్టించి విదేశాల్లో ఏర్పాటు చేసిన తమ డొల్ల కంపెనీలకు మహేష్ ఆ నిధులను మళ్లించాడు. సుమారు రూ.1,500 కోట్లు తరలించారు. బీకే గోయల్ తన నల్లధనాన్ని విదేశాలకు మళ్లించడమే కాకుండా పలువురు స్మగ్లర్లు, ఎగుమతిదారుల సొమ్మును కూడా కమీషన్ పద్ధతిపై దేశం దాటించారు’’ అని దర్యాప్తులో తేలినట్లు ఈడీ వెల్లడించింది

దర్యాప్తులో భాగంగా యాదవేంద్ర కుమార్‌కు చెందిన కాకా గ్రూప్ పేరిట ఉన్న రూ.59.58 కోట్లు, ప్రగతి ప్రింట్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ. 20 లక్షలు, బీకే గోయెల్ భార్య శశిగోయల్ పేరిట ఉన్న రూ.1.50 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీకే గోయెల్, అతని మేనల్లుడు ఆయూష్ గోయెల్, చైనాలోని యునైటెడ్ హిల్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ దీపక్ అగర్వాల్‌ను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. మరికొందరి ప్రమేయాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని