TS News: కుమారుడు, భార్యతో కలిసి జెన్‌కో ఉద్యోగి ఆత్మహత్య

ప్రతికూల పరిస్థితులతో కుంగుబాటుకు గురైన ఓ ఉద్యోగి.. భార్య, కుమారుడితో కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో

Updated : 24 Jul 2021 06:40 IST

ఆర్థిక, ఆరోగ్య సమస్యలే కారణమంటూ లేఖ

పెద్దవూర(రూరల్‌), న్యూస్‌టుడే: ప్రతికూల పరిస్థితులతో కుంగుబాటుకు గురైన ఓ ఉద్యోగి.. భార్య, కుమారుడితో కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్‌) మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన మండారి చిన్నవెంకయ్య, సైదమ్మలకు నలుగురు సంతానం. మొదటి సంతానం రామయ్య (36).. సాగర్‌లోని పైలాన్‌కాలనీలో భార్య నాగమణి (28), కుమారుడు సాత్విక్‌ (12)లతో కలిసి నివాసం ఉంటూ జెన్‌కోలో జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామయ్యకు కొంతకాలంగా తరచూ జ్వరం వస్తుండడంతో పది రోజుల క్రితం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనతో కనిపించేవారు. నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌ వచ్చింది. తరచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుండడంతో మానసికంగా కుంగిపోయిన రామయ్య.. తన ద్వారా కుటుంబసభ్యులకూ ఈ సమస్యలు ఎదురవుతాయని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై భార్య, కుమారుడిని వెంట తీసుకొని సాగర్‌ కొత్త వంతెన వద్దకు వెళ్లారు. సాత్విక్‌ను తొలుత కృష్ణానదిలో పడేశారు. అనంతరం రామయ్య, నాగమణి నదిలో దూకారు. కొత్త వంతెనపై ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. జెన్‌కో ఉద్యోగి కుంటుంబం అందులో దూకినట్లు భావించి.. గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి తాళం పగలగొట్టి చూడగా.. ఓ ఉత్తరం లభించింది. ఆర్థిక పరిస్థితులు, కొవిడ్‌-19 ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్నామని అందులో పేర్కొన్నారు. దీంతో కృష్ణా తీరం వెంట పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం చింతలపాలెం జమ్మనకోట తండా వద్ద నది ఒడ్డున సాత్విక్‌ మృతదేహం లభించింది. ఆ తర్వాత అవతలి ఒడ్డున రామయ్య, నాగమణి మృతదేహాలు ఒకేచోట చేతులు పట్టుకొని పడి ఉండటాన్ని గమనించినట్లు జాలర్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై నర్సింహారావు తెలిపారు. మృతదేహాలను చూడడానికి చింతలపాలెంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలిరాగా.. బంధువుల రోదనలు మిన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని