Crime News: నోటికి టేపు వేసి.. గోనె సంచిలో పెట్టి!

అమ్మ పొత్తిళ్లలో హాయిగా గడపాల్సిన పసికందు చెరువులో శవమై తేలింది. ఆ రెండు నెలల పసిపాప ప్రాణాలను కన్నతండ్రే తీశాడు. వేలుపట్టి నడిపించాల్సిన నాన్నే నోటికి టేపువేసి..

Updated : 23 Oct 2021 06:42 IST

రెండు నెలల పసికందును చెరువులో పడేసిన తండ్రి

అనంతపురం జిల్లాలో దారుణం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అమ్మ పొత్తిళ్లలో హాయిగా గడపాల్సిన పసికందు చెరువులో శవమై తేలింది. ఆ రెండు నెలల పసిపాప ప్రాణాలను కన్నతండ్రే తీశాడు. వేలుపట్టి నడిపించాల్సిన నాన్నే నోటికి టేపువేసి.. గోనెసంచిలో పెట్టి, పైకి తేలకుండా రాయిని ఉంచి మరీ మూటకట్టి నీళ్లలో పడేశాడు. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. శెట్టూరు మండలం ఐదుకల్లు వాసి మల్లికార్జున బెంగళూరులో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి. బెళుగుప్ప మండలం నరసాపురానికి చెందిన చిట్టెమ్మతో ఏడాది కిందట వివాహమైంది. ఆ తర్వాత కొంతకాలానికే ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆగస్టులో వారికి కుమార్తె పుట్టింది. పాపకు అనారోగ్యంగా ఉండటంతో భార్య సహా మల్లికార్జున గురువారం కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి వచ్చాడు. ఈ క్రమంలో పాప ఏడుస్తుంటే... ఓదారుస్తానంటూ బయటకు తీసుకెళ్లాడు. సాయంకాలమైనా తిరిగి రాకపోవడంతో చిట్టెమ్మ, బంధువులు మల్లికార్జునకు ఫోన్‌ చేశారు. పాపను వేరే ఊళ్లో ఉంచానని సమాధానమిచ్చాడు. వారు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ తేజోమూర్తి సిబ్బందితో రాత్రంతా పలుచోట్ల వెతికారు. మల్లికార్జున, పాప ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో మల్లికార్జున ఓ మిత్రుడికి ఫోన్‌ చేసి పాపను చంపి నీటిలో పడేశానని చెప్పాడు. ఆ మిత్రుడు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.  పోలీసులు శుక్రవారం అనంతపురంలో నిందితుడిని పట్టుకుని విచారించారు. శిశువును కళ్యాణదుర్గం శివారు దొడగట్ట బైపాస్‌ సమీపంలోని చెరువులో పడేసినట్లు చెప్పాడు. చెరువులో గాలించగా గోనెసంచిలో అప్పటికే చనిపోయి ఉన్న పాప కనిపించింది. మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని