AP News: ఏపీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల స్కామ్‌.. సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?

హైదరాబాద్‌లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు కేసు దర్యాప్తు మరిన్ని కుంభకోణాల డొంకను కదిలిస్తోంది. విజయవాడలోని రెండు

Updated : 16 Oct 2021 22:07 IST

విజయవాడ: హైదరాబాద్‌లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు కేసు దర్యాప్తు మరిన్ని కుంభకోణాల డొంకను కదిలిస్తోంది. విజయవాడలోని రెండు కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ.14.60 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మాయమైనట్టు ఆయా సంస్థల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సంస్థ పరిధిలో మాయమైన మొత్తాన్ని నిధులు డిపాజిట్‌ చేసిన బ్యాంకు తిరిగి వెంటనే చెల్లించడం చర్చనీయాంశమైంది. నిధులు మాయం కావడం? మళ్లీ డిపాజిట్‌ చేయడం వెనుక సూత్రధారులు, పాత్రదారులు ఎవరనేది త్వరలోనే నిగ్గు తేలుస్తామని పోలీసు ఉన్నాతాధికారులు చెబుతున్నారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన రెండు కేసుల్లో ఒకే తరహా మోసాలు జరగడంతో సమగ్ర దర్యాప్తు కోసం తూర్పు మండల డీసీపీ హర్షవర్దన్‌రాజు పర్యవేక్షణలో సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌కు దర్యాప్తు బాధ్యతను అప్పగించినట్టు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. 

విజయవాడలోని ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌ పరిధి వీరపనేనిగూడెంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఏపీ కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోయర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు దుర్వినియోగం, దారిమళ్లింపు పట్ల సంస్థ మేనేజరు చలపాక రమణమూర్తి ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రూ.5కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను నకిలీపత్రాలు సృష్టించి, ఆయిల్‌ సీడ్స్‌ గ్రోయర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ఉద్యోగుల సంతకాలు ఫోర్జరీ చేసి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించి దుర్వినియోగం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఏడాది మేలో ఈ కుంభకోణం జరిగినట్టు అనుమానిస్తున్నారు. సంస్థకు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లావాదేవీలపై సమగ్ర దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నామన్నారు. ఇదే సమయంలో ఏపీ స్టేట్‌ వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ.9.60కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను భవానీపురం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులో ఉంచారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉద్యోగుల సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో కరెండ్‌ అకౌంట్‌ తెరిచి దాన్నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వివిధ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి దుర్వియోగం చేసినట్టు ఆ సంస్థ మేనేజరు యర్రాప్రగడ పట్టాభిరామయ్య ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవానీపురం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసినట్టు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండు కేసులను సీసీఎస్‌ ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు.

ఈ రెండు కేసుల దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులతోనూ చర్చిస్తున్నారు. తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నిధుల దుర్వినియోగం, వాటి మళ్లింపు కేసులో అరెస్టు అయిన నిందితుల ప్రమేయం ఈ రెండు కేసుల్లోనూ ఉందని ప్రాథమికంగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన  రూ.9.60 కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్‌ మొత్తాన్ని ఐవోబీ బ్యాంకు తిరిగి సంస్థ ఖాతాలో జమ చేసింది. వడ్డీ మొత్తం కూడా ఇస్తామని బ్యాంకు ఉన్నతాధికారులు వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌కు సమాచారం అందించారు. ఈ కుంభకోణం ఎవరి సహకారంతో జరిగింది? డబ్బులు బయటకు వెళ్లడం.. మళ్లీ వెనక్కి రావడంలో కీలకంగా వ్యవహరించింది ఎవరనేది దర్యాప్తులో నిగ్గు తేలుస్తామని సీపీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు