Courier Boys: యూట్యూబ్‌లో చూసి.. రూ.9 లక్షల పార్సిళ్లు కాజేసి

తేరగా డబ్బులు సంపాదించాలనే దురాశతో నలుగురు యువకులు కొరియర్‌లో వచ్చిన విలువైన వస్తువులను తస్కరించారు. వాటిని విక్రయించగా వచ్చిన

Updated : 30 Aug 2021 06:59 IST

కరీంనగర్‌ జిల్లాలో కొరియర్‌ బాయ్‌ల మోసం

సైదాపూర్‌, న్యూస్‌టుడే: తేరగా డబ్బులు సంపాదించాలనే దురాశతో నలుగురు యువకులు కొరియర్‌లో వచ్చిన విలువైన వస్తువులను తస్కరించారు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌కు చెందిన కల్యాణ్‌, వికాస్‌, అనిల్‌, వినయ్‌లు మూడు నెలలుగా ఫ్లిప్‌కార్ట్‌ కొరియర్‌ బాయ్‌లుగా పనిచేస్తున్నారు. తమ స్నేహితులు, బంధువుల పేర్లపై ఫోన్‌ ద్వారా విలువైన వస్తువులను ఆర్డర్‌ చేసేవారు. హుజూరాబాద్‌ హబ్‌కు కొరియర్‌ రాగానే వాటిని తీసుకునేవారు. వాటిని సైదాపూర్‌కు తీసుకువచ్చి.. ఆర్డర్‌ చేసిన ఫోన్‌ నంబరును స్విచ్ఛాఫ్‌ చేసేవారు. వినియోగదారుడి నుంచి ఎలాంటి సమాధానం లేదంటూ ఆర్డర్‌ను రద్దు చేసేవారు. పార్సిల్‌లో వచ్చిన వస్తువులను తీసి.. అదే బరువులో రాళ్లు, పెంకులు తదితర వస్తువులను పెట్టేవారు. అనుమానం రాకుండా ప్యాకింగ్‌ చేసి పార్సిల్‌ను తిప్పిపంపించేవారు. యూట్యూబ్‌లో ఈ తరహా నేరాలను చూసి వారు ఆచరణలో పెట్టారు. తరచూ ఆర్డర్‌లు రద్దు కావడంతో హుజూరాబాద్‌ హబ్‌ ప్రతినిధిగా పనిచేస్తున్న నవీన్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నలుగురు యువకుల మోసం బయటపడింది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించటంతో వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి 8 ల్యాప్‌టాప్‌లు, 4 కెమెరాలు, 5 గడియారాలు, 5 మొబైల్‌ ఫోన్లు, 4 ఇయర్‌ పాడ్స్‌, 1 వైర్‌లైస్‌ ఛార్జర్‌, 1 సోనీ మ్యూజిక్‌ సిస్టం, 2 బూట్ల జతలు తదితరాలు కలిపి మొత్తం రూ.9 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని