
Karvy Stock Broking case: కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. కార్వీ సెక్రటరీ అరెస్టు
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు... కంపెనీ సెక్రటరీ శైలజను అరెస్ట్ చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కంపెనీ తప్పుడు తీర్మానాలు చేసి... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును మోసం చేసినందుకు కార్వీ కంపెనీ సెక్రటరీ శైలజను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 2018లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో షేర్లకు సంబంధించి ఎలాంటి తీర్మానం చేయకున్నా... కంపెనీ సెక్రటరీ మాత్రం నకిలీ తీర్మానాన్ని సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తీర్మానాన్ని చూపించి కార్వీ ఛైర్మన్ పార్థసారథి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ. 350 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ మినిట్స్ బుక్‌ను పరిశీలించారు. ఎలాంటి తీర్మానం చేయలేదని తేలడంతో శైలజ మోసం చేసినట్లు పోలీసులు తేల్చారు. కార్వీ ఛైర్మన్ పార్థసారథితో పాటు సంస్థ సీఎఫ్‌వో సీఎఫ్‌వో కృష్ణహరి, సీఈవో రాజీవ్ సింగ్‌ను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి మరోసారి పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఇవాళ, రేపు ప్రశ్నించనున్నారు.