Crime News: సైదాబాద్‌ ఘటన.. రంగంలోకి దిగిన 500 మంది పోలీసులు

సైదాబాద్ హత్యాచార నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దాదాపు 500 మంది పోలీసులు నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి

Updated : 09 Sep 2022 14:37 IST

హైదరాబాద్: సైదాబాద్ హత్యాచార నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దాదాపు 500 మంది పోలీసులు నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు కమిషనరేట్ల  ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షించారు. నిందితుడి కోసం టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లేబర్‌ అడ్డాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు రాజుకు మద్యం అలవాటు ఉందనే సమాచారంతో నగరంలోని మద్యం, కల్లు దుకాణాల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.

ఈ నెల 10న నిందితుడు బాలాపూర్‌లో తిరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాలు లభ్యమైన విషయం తెలిసిందే. ఎల్‌బీ నగర్‌లోని మద్యం దుకాణానికి రాజు వెళ్లినట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఎల్‌బీ నగర్‌ ప్రధాన రహదారులు, వీధుల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు మారు వేషాలతో తిరిగే అవకాశం ఉన్నందున, జుట్టు, గడ్డం వంటి మార్పులతో నిందితుడిని పోలి ఉండే చిత్రాలను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖలాలు లేవు.

పోలీసులు తెలిపిన నిందితుడి ఆనవాళ్లివే... 

* నిందితుడి పేరు: పల్లకొండ రాజు, వయస్సు 30 సంవత్సరాలు

*  5.9 అడుగుల ఎత్తు

* టోపీ పెట్టుకొని ఎర్ర చేతిరుమాల ముఖానికి పెట్టుకున్నాడు.

* రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫ్యాంట్‌, షర్ట్‌ ధరించి ఉన్నాడు.

* మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని