Crime News: హైదరాబాద్‌ వ్యాపారవేత్త కిడ్నాప్‌.. దారుణహత్య

నగరంలోని చార్మినార్‌కు చెందిన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

Updated : 22 Aug 2021 14:45 IST

హైదరాబాద్‌: నగరంలో అదృశ్యమైన చార్మినార్‌కు చెందిన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులే కిడ్నాప్‌ చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలన్నందుకు కిడ్నాప్‌ చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. జహీరాబాద్‌ వైపు తీసుకెళ్లి చంపేసి ఓ పొలంలో పూడ్చి పెట్టారు.

పోలీసుల ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి చార్మినార్‌లో వ్యాపారం చేస్తుంటారు. అతడి మిత్రులు సంజు, గిరీశ్‌, గాడ్జే తరచూ అక్కడికి వస్తుండేవారు. మధుసూదన్‌ వద్ద వీరు రూ.40 లక్షల మేర అప్పుగా తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మధుసూదన్‌ అడగడంతో హతమార్చేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో ఈనెల 19న మధుసూదన్‌రెడ్డిని జగన్నాథ్‌ అనే కారు డ్రైవర్‌తో కలిసి ఆ ముగ్గురూ కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. సంగారెడ్డి సమీపంలోని ఓ దాబా వద్ద ఆగి జగన్నాథ్‌తో పాటు ఆయన కారును వదిలేసి వేరే కారులో మధుసూదన్‌రెడ్డిని తీసుకెళ్లారు.

హత్య చేసిన అనంతరం ఆ విషయాన్ని జగన్నాథ్‌కు చెప్పి కిడ్నాప్‌ డ్రామాగా చెప్పాలని సూచించారు. మధుసూదన్‌ అదృశ్యమైన నేపథ్యంలో అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చార్మినార్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కారు నంబర్‌ ఆధారంగా జగన్నాథ్‌ను గుర్తించి విచారించగా హత్య విషయం బయటపడింది. పొలంలో పూడ్చిపెట్టిన మధుసూదన్‌ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. నిందితులు మధుసూదన్‌ను హతమార్చిన అనంతరం ముంబయి హైవే వైపు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామని సౌత్‌జోన్‌ డీసీపీ గజరావు భూపాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని