TS News: మెదక్‌ జిల్లాలో కల్తీ కల్లు కలకలం: 10 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 10 మంది అస్వస్థతకు గురైన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌, శివ్వంపేట మండలాల్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివ్వంపేట మండలం

Published : 29 Dec 2021 01:35 IST

తూప్రాన్‌: కల్తీ కల్లు తాగి 10 మంది అస్వస్థతకు గురైన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌, శివ్వంపేట మండలాల్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి కొంతాన్‌పల్లితోపాటు తూప్రాన్‌ మండలంలోని వట్టూర్‌ గ్రామంలో కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నాడు. సోమవారం వట్టూర్‌లో శివకుమార్‌, యాదగిరి, కొమరయ్య, మహేశ్‌, వరలక్ష్మి, శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లిలో వెంకటేశ్‌, నాగరాజు, రమేశ్‌, పోతులగూడెంకు చెందిన మరో ఇద్దరు ఆయా గ్రామాల్లో కల్లు సేవించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి వీరంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాళ్లు, చేతులు, మెడ, నోరు వంకర్లు తిరిగాయి. గమనించిన కుటుంబసభ్యులు వీరిని తూప్రాన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

వీరిలో కొంతాన్‌పల్లికి చెందిన నాగరాజు, వెంకటేశ్‌ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కల్లులో మోతాదుకు మించి రసాయనాలు వినియోగించడం వల్లే వీరంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అబ్కారీ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కల్లు దుకాణాల్లో అధిక మోతాదులో రసాయనాలు వినియోగిస్తున్నారని, అందువల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని