Jharkhand: షాకింగ్‌.. ఆటోతో ఢీకొట్టి న్యాయమూర్తి దారుణ హత్య..!

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. అదనపు సెషన్స్‌, జిల్లా కోర్టు జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను బుధవారం ఉదయం

Updated : 29 Jul 2021 12:59 IST

రాంచీ: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలీసులు కథనం ప్రకారం.. 

జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్‌ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. రోడ్డు పక్కన జాగింగ్‌ చేసుకుంటూ వెళ్తుండగా.. ఓ ఆటో వచ్చి ఆయనకు ఢీకొట్టి వేగంగా వెళ్లింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయమూర్తి కన్నుమూశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఓ జడ్జి అని తెలియకపోవడంతో కొన్ని గంటల వరకు ఆయన మృతి విషయం బయటకు రాలేదు.

ఉదయం 7 గంటలవుతున్నా జస్టిస్‌ ఆనంద్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే గాలింపు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడిన ఆసుపత్రిలో మరణించినట్లు తెలిసింది. దీంతో హిట్‌ అండ్‌ రన్‌గా పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. వాహనంలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఢీకొట్టినట్లు తెలియడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. 

కాగా.. ఘటనకు ఉపయోగించిన ఆటోను కొద్ది గంటల ముందే దొంగలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటివరకు ఆటో డ్రైవర్‌, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. జస్టిస్‌ ఆనంద్‌ ధన్‌బాద్‌లో అనేక మాఫియా హత్య కేసులను విచారించారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు బెయిల్‌ నిరాకరించారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడం కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 

మరోవైపు న్యాయమూర్తి హత్యపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని సుమోటో పరిగణించి విచారణ చేపట్టాలని కోరింది. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందిస్తూ.. ఈ విషయంపై ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడానని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉందని, ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తున్నామని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు