Karvy Stock Broking case: హెచ్‌డీఎఫ్‌సీ ఫిర్యాదు.. మరోసారి పోలీస్‌ కస్టడీకి పార్థసారథి

షేర్లు తనఖా ఉంచి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అభియోగాలు

Updated : 03 Sep 2021 14:57 IST

హైదరాబాద్: షేర్లు తనఖా ఉంచి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పార్థసారథిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. పార్థసారథిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తసుకున్న సీసీఎస్‌ పోలీసులు ఇవాళ, రేపు ప్రశ్నించనున్నారు. పెట్టుబడిదారుల షేర్లను తనఖా పెట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.347 కోట్లు తీసుకున్నట్లు పార్థసారథిపై అభియోగాలున్నాయి. తిరిగి చెల్లించకపోవడంతో పార్థసారథిపై హెచ్‌డీఎఫ్‌సీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పార్థసారథిని సీసీఎస్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం ఇది మూడో సారి కావడం గమనార్హం.

ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు రెండు సార్లు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఇండస్ ఇండ్ బ్యాంకులో తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన పూర్తి వివరాలను పార్థసారథి నుంచి సేకరించారు. పెట్టుబడిదారులకు చెందిన డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను బ్యాంకులో తనఖా పెట్టి రూ.137 కోట్లను పార్థసారథి రుణంగా తీసుకున్నారు. కార్వీ సంస్థ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సీసీఎస్‌ పోలీసులు రాబట్టారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌తో పాటు అనుబంధ సంస్థలకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాలను ఇప్పటికే సీసీఎస్ పోలీసులు స్తంభింపజేశారు. దర్యాప్తులో భాగంగా పార్థసారథి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సీసీఎస్‌ పోలీసులు కార్వీ సంస్థ సీఎఫ్‌వో కృష్ణహరి, సీఈవో రాజీవ్‌ సింగ్‌ను నిన్న అరెస్టు చేశారు. డొల్ల కంపెనీల పేరుతో కృష్ణ హరి, రాజీవ్‌ మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. పార్థసారథి ఆదేశాలతోనే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తేల్చారు. ఏడేళ్లుగా ఈ ఇద్దరు నిందితులు డొల్ల కంపెనీలను నిర్వహిస్తున్నట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ ఫిర్యాదు మేరకు పార్థసారథిని పోలీసులు మరోసారి కష్టడీలోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని