Crime News: మరో వ్యక్తితో నిశ్చితార్థం.. యువతిపై ప్రేమోన్మాది దాడి

ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌

Updated : 10 Nov 2021 19:54 IST

నాగోలు‌: ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలానికి చెందిన యువతి (20), అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్ (23) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

3 నెలల క్రితం యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. బస్వరాజ్‌తో ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి యువతిని నగరంలోని హస్తినాపురంలో నివాసం ఉంటున్న ఆమె బాబాయి ఇంట్లో ఉంచారు. సన్‌సిటీ సమీపంలోని రామ్‌దేవ్‌గూడలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బస్వరాజ్‌కు ఈ విషయం తెలిసింది. ఇవాళ మధ్యాహ్నం  యువతి ఉంటున్న ఇంటికి చేరుకొని ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి పొట్ట, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు యువతిని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

యువతి శరీరంపై 18 చోట్ల కత్తిపోట్లు

దాడిలో గాయపడిన యువతి శరీరంపై 18 చోట్ల కత్తి పోట్లు ఉన్నాయని చికిత్స అందిస్తున్న నవీన ఆసుపత్రి వైద్యులు రణధీర్‌ తెలిపారు. ఛాతీ, ఊపిరిత్తుల భాగంలో మేజర్‌ గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని, 48 గంటలు గడిస్తే గాని బాధితురాలి పరిస్థితి చెప్పలేమని వెల్లడించారు.

పెళ్లి ఆపేస్తానని బెదిరించాడు: బాధితురాలు

‘‘వేరే పెళ్లి చేసుకుంటున్నానని బస్వరాజ్‌ కత్తితో పొడిచాడు. గతంలో ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. వేరే వ్యక్తితో నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నావని బస్వరాజ్‌ నిలదీశాడు. పెళ్లి ఆపేస్తానని బెదిరించాడు’’ అని బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని