Drugs: పొట్టలో భారీగా డ్రగ్స్‌.. వీడొక్కడే సినిమా సీన్‌ రిపీట్‌!

బెంగళూరు విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated : 22 Aug 2021 13:54 IST

బెంగళూరు: డ్రగ్స్‌ అక్రమ రవాణాలో కేటుగాళ్లు రోజుకో పద్ధతిని అనుసరిస్తున్నారు. బట్టలు, పుస్తకాలు, లోదుస్తులు, ఎలక్ట్రానిక్‌ పరికాలు.. ఇలా వినూత్న రీతిలో మాదకద్రవ్యాలను తరలిస్తున్న దుండగులు.. ఒంటిని సైతం సాధనంగా మార్చుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తమ జీవితాలనే పణంగా పెడుతున్నారు. సూర్య, తమన్నా జంటగా నటించిన ‘వీడొక్కడే’ సినిమా గుర్తుంది కదా! అందులో సూర్య స్నేహితుడు విలన్‌తో చేతులు కలిపి డ్రగ్స్‌ రవాణా చేస్తాడు. డబ్బులకు కక్కుర్తి పడి ఏకంగా పొట్టలో డ్రగ్స్‌ పొట్లాలను దాచి పెట్టుకొని రవాణా చేస్తాడు. తాజాగా బెంగళూరు విమానాశ్రయంలోనూ ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి పొట్టలో రూ.11 కోట్ల విలువైన కొకైన్‌ ఉంచినట్లు విమానాశ్రయంలోని ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)’ భద్రతా సిబ్బంది గుర్తించారు. దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చిన సదరు వ్యక్తి విమానంలో ఆహారం, నీరు తీసుకోకపోవడంతో అతడిపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని స్కాన్‌ చేయగా పొట్టలో భారీగా కొకైన్‌ ఉన్నట్లు గుర్తించారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఆ వ్యక్తిని తర్వాత ఆసుపత్రికి తరలించారు. నిందితుడు తొలుత నేరాన్ని అంగీకరించలేదు. తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులను కోరాడు. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కొకైన్ పొట్లాలను బయటకు తీశారు. అయితే, వాటిని తీసుకోవడానికి వచ్చే వారి వివరాలను మాత్రం నిందితుడు బయటకు వెల్లడించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని