Ts News: వనమా రాఘవ అరెస్టులో ట్విస్ట్‌.. పోలీసుల ప్రకటనతో గందరగోళం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

Updated : 07 Jan 2022 09:39 IST

హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అరెస్టు విషయంలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అసలు వనమా రాఘవ తమకు దొరకలేదంటూ కొత్తగూడెం పోలీసులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. రాఘవ కోసం ఏడెనిమిది బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ వెల్లడించారు. వనమా దొరికితే కస్టడీలోకి తీసుకుంటామన్నారు. వనమా రాఘవపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఆధారాలు లభిస్తే రాఘవపై రౌడీషీట్ నమోదు చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు.

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమా రాఘవేంద్రరావును హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు లే ఖ రాశారు. తన కుమారుడిపై రామకృష్ణ ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. రాఘవను పోలీస్‌ విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో రాఘవను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రాఘవపై పాల్వంచ పీఎస్‌లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రాఘవను పోలీసులు అరెస్టు చేయలేదని పాల్వంచ ఏఎస్పీ అధికారిక ప్రకటన చేయడంతో గందరగోళం నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని