Crime News: పంజాగుట్ట బాలిక హత్య కేసు.. తల్లే హంతకురాలు!

నగరంలోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిన్నారి తల్లితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 13 Nov 2021 16:44 IST

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఈ కేసులో చిన్నారి తల్లితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని తల్లే ప్రియుడితో కలసి కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో తల్లి హీనాబేగం, ప్రియుడు షేక్‌ మహ్మద్‌ ఖాదర్‌ను నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటి నుంచి పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో నిందితులను గుర్తించారు. ఘటనకు సంబంధించి ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పోలీసులు వెల్లడించారు.

షేక్‌పేటలో ఉంటే ఖాదర్‌తో హీనా బేగంకు పరిచయం ఏర్పడింది. సాన్నిహిత్యం వివాహేతర బంధానికి దారి తీసింది. పిల్లల్ని తీసుకొని ఇద్దరూ ముంబయి, చెన్నై, జైపూర్‌,మనాలి వెళ్లారు. అక్కడ పిల్లలతో బిక్షాటన చేయించారు. చిన్నారి మెహక్‌ బిక్షాటన చెయ్యడం ఇష్టం లేక నిరాకరించింది. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయగా.. ఖాదర్‌ ,హీనీ చిన్నారిని తీవ్రంగా కొట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి చిన్నారి మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చి ద్వారకాపురి కాలనీలో ఒక షాప్ వద్ద వదలి వెళ్లారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. లకడీకాపూల్‌ వద్ద ఉన్న కెమెరాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చి, నిందితులిద్దర్నీ అరెస్టు చేశామని పంజాగుట్ట సంయుక్త సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. నిందితులకు బాలికను చంపాలన్న ఉద్దేశం లేదని, మాట వినకపోవడం వల్ల పదేపదే హింసించారని జాయింట్‌ సీపీ శ్రీనివాస్‌ తెలిపారు. తల్లి వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడం, తండ్రి దగ్గరకు తీసుకెళ్లాలని అడగటం వల్లే కొట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే పాప ప్రాణాలు కోల్పోయిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని