Student: సెలవుల కోసం విద్యార్థి దుస్సాహసం.. మంచినీటిలో పురుగుల మందు కలిపి..

పాఠశాలకు సెలవులు ప్రకటించాలనే ఉద్దేశంతో 11వ తరగతికి చెందిన హాస్టల్‌ విద్యార్థి మంచినీటిలో పురుగు మందు కలిపి తోటి విద్యార్థులతో తాగించాడు......

Updated : 12 Dec 2021 04:47 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని బార్​గఢ్​ జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. పాఠశాలకు సెలవులు ప్రకటించాలనే ఉద్దేశంతో 11వ తరగతికి చెందిన హాస్టల్‌ విద్యార్థి మంచినీటిలో పురుగు మందు కలిపి తోటి విద్యార్థులతో తాగించాడు. దీంతో భట్లీ బ్లాక్‌లోని కామ్‌గావ్ ఉన్నత పాఠశాలలో కలకలం రేగింది. 11, 12వ తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వారందరిని ఆసుపత్రి తరలించారు.

బార్​గఢ్ జిల్లా నువాపల్లికి చెందిన విద్యార్థి కామ్‌గావ్ ఉన్నత పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో డిసెంబర్ 19 నుంచి ఒడిశాలో లాక్‌డౌన్ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్​గా మారింది. దాన్ని నిజమని నమ్మిన సదరు విద్యార్థి పాఠశాలను మూసేస్తే ఇంటికి వెళ్లొచ్చని సంబరపడ్డాడు. కానీ లాక్​డౌన్​ లాంటిది ఏమీ లేదని.. సెలవులు రావని తెలుసుకుని కలత చెందాడు. అయినప్పటికీ పాఠశాలను ఎలాగైనా మూసేసేలా చేస్తానని స్నేహితుల వద్ద చెబుతుండేవాడు.

ఈ క్రమంలోనే సదరు విద్యార్థి డిసెంబర్ 8న వాటర్‌ బాటిల్‌లో పురుగుమందు కలిపి హాస్టల్​లోని తన స్నేహితులకు అందించాడు. అవి తాగిన 19 మంది ఒంట్లో వికారంగా ఉండటం, కళ్లు తిరగడంతోపాటు వాంతులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న హాస్టల్​ సిబ్బంది.. విద్యార్థులను కామ్‌గావ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. వారిని పరిశీలనలో ఉంచామని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమానంద పటేల్.. సదరు బాలుడిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని