Telugu Akademi Scam: ‘రూ.80 లక్షలు కాల్చేశాను’.. బ్యాంకు మేనేజర్ సాధన పొంతనలేని సమాధానం

తెలుగు అకాడమీ కేసులో హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు

Updated : 15 Oct 2021 09:56 IST

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ కేసులో హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధనకు సమీప బంధువైన సాంబశివరావు.. డిపాజిట్లు గోల్‌మాల్‌ చేసిన ముఠాకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా ప్రధాన నిందితుడు సాయి కుమార్‌ను పరిచయం చేసుకున్న సాంబశివరావు.. బ్యాంకుల్లోని ప్రభుత్వ శాఖల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో సాయి కుమార్‌కు కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సాంబశివరావు పరిచయం చేశారు. ఆ తర్వాత కొల్లగొట్టిన నగదులో సాంబశివరావు తన వాటాగా రూ.50 లక్షలు తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నా.. సాధన సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. నిధులు గోల్‌మాల్‌ చేసిన వ్యవహారంలో సాధన దాదాపు రూ.2 కోట్లకుపైగా తన వాటాగా తీసుకున్నట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
వాటాగా తీసుకున్న దానిలో రూ.80 లక్షలు కాల్చేసినట్లు సీసీఎస్ పోలీసులకు సాధన పొంతన లేని సమాధానం చెప్పారు. అవసరమైతే నోట్లు కాల్చేసిన స్థలానికి క్లూస్ టీంను తీసుకొని ఆధారాలు సేకరించాలనే యోచనలో సీసీఎస్ పోలీసులు ఉన్నారు. రేపటితో ఆమె కస్టడీ ముగుస్తుండటంతో మరో నాలుగు రోజులు కస్టడీ పొడిగించాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని