
Crime news: చదివింది పదో తరగతే ... ఆన్‌లైన్ మోసాల్లో ఆరితేరారు
హైదరాబాద్: సోఫా కొంటానని ఒకరు, స్నేహితుడి పేరుతో ఫేస్‌బుక్‌లో డబ్బులు అవసరం అంటూ మరొకరు ... ఇలా ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన 12మంది సభ్యుల ముఠా సైబర్ మోసాలకు పాల్పడుతోంది. సైబరాబాద్ పోలీసులు 12 మంది నిందితులను అల్వార్‌లో అరెస్టు చేసి సైబరాబాద్ తీసుకొచ్చి జైలుకు పంపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ నిందితులపై పలు కేసులు ఉండటంతో కూకట్‌పల్లి కోర్టును పీటీ వారెంట్ కోరారు. 12 మందిని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. ఓఎల్‌ఎక్స్‌లో వస్తువులు కొంటామని అమాయకులను నమ్మించి బాధితుల ఖాతా నుంచి నగదు లాగేసుకున్నారు. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ..ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు వసూలు చేసినట్టు కూడా నిందితులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇదే ముఠాపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ పలు కేసులున్నాయి. ఈ ముఠాలోని సభ్యులు పదో తరగతి వరకే చదివినా.. ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్ హ్యాకింగ్ వంటి సైబర్ నేరాల్లో ఆరితేరారని పోలీసులు వెల్లడించారు.