Crime news: సైదాబాద్‌ బాలిక హత్య ఘటన... పోలీసుల అదుపులో నిందితుడు రాజు

నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా

Updated : 07 Dec 2022 19:17 IST

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో అరెస్టు చేశారు. రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ వెల్లడించారు. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమవడంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. తూర్పు మండలం డీసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి

ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు నిన్న నిరసన తెలిపారు. చంపాపేట నుంచి సాగర్‌ వెళ్లే రోడ్డులో దాదాపు 7 గంటల పాటు బైఠాయించారు. కలెక్టర్‌ హామీతో ఆందోళన విరమించారు. ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, డీసీసీ రమేశ్‌రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని.. రెండు పడక గదుల ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు అందజేశారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. చిన్నారి మృతదేహానికి ఉస్మానియా మర్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్యచేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని