HYD: మణికొండలో గల్లంతైన వ్యక్తి.. ఆచూకీ కోసం డ్రోన్‌తో గాలింపు!

గరంలోని మణికొండలో వరదకు కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ రెండు రోజులైనా దొరకలేదు.

Updated : 27 Sep 2021 09:23 IST

హైదరాబాద్‌: నగరంలోని మణికొండలో వరదకు కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ రెండు రోజులైనా దొరకలేదు. సుమారు వంద మంది వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఆదివారం రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఉదయం గాలింపు చర్యలను కొనసాగించాలని నిర్ణయించారు. గల్లంతైంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా అనుమానిస్తున్నారు. ఇవాళ నెక్నాంపూర్‌ చెరువులో డీఆర్‌ఎఫ్‌ బృందాలు డ్రోన్‌ సాయంతో ఆ వ్యక్తి కోసం గాలించనున్నాయి. ఇందు కోసం చెరువులో గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గుర్రపుడెక్క తొలగింపునకు ఫ్లోటింగ్‌ జేసీబీని తెప్పించనున్నారు. కాగా, గల్లంతైన వ్యక్తి రజనీకాంత్‌ అని పోలీసులు వెల్లడించారు. తమకు చూపించకుండా అతను మా కుటుంబ సభ్యుడేనని ఎలా చెబుతారంటూ గల్లంతైన వ్యక్తి కుటుంబ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు.

అసలేం జరిగింది..

మణికొండలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు సెక్రటేరియట్‌ కాలనీ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యాన్‌హోల్లోకి చేరింది. రాత్రి 9.15గం.ల సమయంలో కాలినడకన అటువైపుగా వెళ్తున్న వ్యక్తి అందులో పడి గల్లంతయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా రికార్డ్‌ అయ్యింది. ఇది వైరల్‌ కావడంతో నార్సింగి పోలీసులు, మణికొండ మున్సిపల్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహకారంతో డ్రైనేజి పొడవునా వెదికినా గల్లంతయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్‌ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని