Published : 14 Nov 2021 07:27 IST

Crime News: నాన్న కావాలనడమే.. ‘పాప’మైంది

వీడిన పంజాగుట్ట బాలిక మృతదేహం కేసు మిస్టరీ

వివరాలు వెల్లడిస్తున్న ఏఆర్‌ శ్రీనివాస్‌. చిత్రంలో ఇతర పోలీసు అధికారులు (ముసుగులో నిందితులు)

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: పంజాగుట్టలోని ఓ దుకాణం ముందు దొరికిన బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి చంపేసినట్లు తేల్చారు. తల్లితో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. నగర సంయుక్త కమిషనర్‌, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ శనివారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మియాపూర్‌లోని హఫీజ్‌పేటకు చెందిన హీనాబేగం(22)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఓ చోరీ కేసులో ఆరు నెలలుగా జైలులో ఉంటున్నాడు. వీరికి కుమారుడు(7), నాలుగు, మూడేళ్ల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్లుకు బానిసైన హీనాబేగం నిత్యం షేక్‌పేటలోని కల్లు దుకాణానికి వెళ్లేది. ఈ క్రమంలో డబీర్‌పురా సునార్‌గల్లీకి చెందిన షేక్‌ మహ్మద్‌ ఖాదర్‌ అలియాస్‌ రిజ్వాన్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకుని పిల్లల బాధ్యత తీసుకుంటానని వారిని ముంబయి తీసుకెళ్లాడు రిజ్వాన్‌. అక్కడి నుంచి దిల్లీ, జైపూర్‌, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ, భిక్షాటన చేసి జీవనం సాగిస్తూ వచ్చారు.

ఇంటికి వెళ్దామమ్మా..: భిక్షాటన చేయడం, తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం పెద్ద కుమార్తెకు నచ్చలేదు. ఇంటికెళ్లి నాన్నను కలుద్దాం.. అంటూ ఆ చిన్నారి మారాం చేయడం మొదలు పెట్టింది. దీంతో కోపగించుకున్న హీనాబేగం, షేక్‌ మహ్మద్‌ ఖాదర్‌ ఈనెల 3న బాలికను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. చిన్నారిని తీసుకుని ప్రైవేట్‌ బస్సులో నగరానికి వచ్చారు. ఖైరతాబాద్‌లో ఆటో ఎక్కి పంజాగుట్ట ద్వారకాపురి కాలనీ వద్ద దిగి మృతదేహాన్ని పడేసి పారిపోయారు. పోలీసులు నిఘా నేత్రాలను పరిశీలించి నిందితులను జేబీఎస్‌లో అరెస్టు చేశారు. పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి, డీఐ కె.నాగయ్య, ఎస్సైలు విజయభాస్కర్‌ రెడ్డి, నాగరాజు, సతీష్‌కుమార్‌, సిబ్బంది కేసును ఛేదనలో తీవ్రంగా శ్రమించారని సంయుక్త కమిషనర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని