Road Accident: వంకలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వంకలోకి దూసుకెళ్లింది. 

Updated : 30 Dec 2021 13:04 IST

విడపనకల్‌: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వంకలోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి గుంతకల్ వైపు నుంచి బళ్లారి వైపు వెళ్తున్న కారు డోనేకల్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టి ఈ ఉదయం బళ్లారి ప్రాంతానికి చెందిన అశ్వత్‌ నారాయణ మృతదేహాన్ని వెలికితీశారు.

వివరాల్లోకి వెళితే.. అదుపుతప్పిన కారు నిన్న రాత్రి వంకలో పడటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు క్రేన్లు తెప్పించి తాళ్లను కట్టి లాగగా కారు పరికరాలు ఊడొచ్చాయి. నల్లరేగడి నేల కావడంతో కారు బురదలో ఇరుక్కుందని, ఆ గుంత 30 అడుగులకు పైగా లోతు ఉన్నట్లు స్థానికులుచెబుతున్నారు. వాహనాలకు ఉన్న దీపాల వెలుతురు సాయంతోనే అర్ధరాత్రి వరకు సహాయ చర్యలు కొనసాగించినా వెలికి తీయడం కాలేదు. ఈ ఉదయం అశ్వత్ నారాయణ మృతదేహాన్ని వెలికి తీశారు. హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి అశ్వత్ బళ్లారికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు మృతుడి స్నేహితులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని