TS News: రోడ్డు ప్రమాదంలో నవవధువు, తండ్రి మృతి.. వరుడు సహా ఏడుగురికి గాయాలు

ఒక్కగానొక్క కుమార్తె.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మంచి సంబంధం చూసి ఆడంబరంగా పెళ్లి చేశారు. అంతలోనే సంతోషం ఆవిరైపోయింది. వరుడి ఇంటి వద్ద విందు (రిసెప్షన్‌)కు హాజరై తిరిగి వస్తున్నారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి

Updated : 29 Aug 2021 10:20 IST

కడెం, న్యూస్‌టుడే: ఒక్కగానొక్క కుమార్తె.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మంచి సంబంధం చూసి ఆడంబరంగా పెళ్లి చేశారు. అంతలోనే సంతోషం ఆవిరైపోయింది. వరుడి ఇంటి వద్ద విందు (రిసెప్షన్‌)కు హాజరై తిరిగి వస్తున్నారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా, మృత్యువు పంజా విసిరింది. వధువు, ఆమె తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. వరుడు, వధువు తల్లి సహా పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. పాతమద్దిపడిగకు చెందిన కొండ రాజన్న (49), వసంతలకు ఏకైక కుమార్తె మౌనిక (24). దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ బిడ్డను డిగ్రీ వరకు చదివించారు. సింగరేణిలో పనిచేస్తున్న మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా రాజురాకు చెందిన జనార్దన్‌తో ఈ నెల 25న తమ ఇంటివద్ద కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. వరుడి స్వగ్రామంలో శుక్రవారం నిర్వహించిన విందుకు బంధువులంతా వెళ్లి, రాత్రివేళ వాహనాల్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఊరు సమీపిస్తుండగానే విధి వక్రించింది. వధూవరులు ప్రయాణిస్తున్న వాహనం పాండ్వాపూర్‌ సమీపంలోని కడెం వంతెనను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో వధువు, ఆమె తండ్రి అక్కడికక్కడే మృతిచెందారు. వరుడు, వధువు తల్లి, నలుగురు బంధువులు, డ్రైవర్‌ గాయపడడంతో వారిని నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.  డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని