
AP News: విశాఖ సూర్యాబాగ్ ఘటన.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
విశాఖ: విశాఖపట్నంలోని సూర్యాబాగ్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు హర్షవర్దన్ మృతి చెందాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయాడు. ఈ నెల 13న యువతిపై పెట్రోల్ పోసిన హర్షవర్దన్ తానూ నిప్పంటించుకున్నాడు. యువతి పెళ్లికి నిరాకరించిన కారణంగానే హర్షవర్దన్ దాడికి పాల్పడ్డాడని వార్తలొచ్చాయి. పెట్రోల్ దాడి కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.
అసలేం జరిగిందంటే..
సూర్యాబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. హోటల్ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్‌కు తరలించారు. తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్‌రెడ్డి(21), విశాఖ నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన యువతి(20) పంజాబ్‌లో కలిసి ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో దిగాడు. తాను వచ్చిన విషయం చెప్పడంతో ఆ యువతి కూడా వచ్చింది. తనను వివాహం చేసుకోవాలని అతను కోరడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆగ్రహం చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటు...తనపై కూడా పెట్రోలు పోసుకున్నాడు. హర్షవర్ధన్‌రెడ్డికి 62శాతం, ఆ యువతికి 61శాతం కాలిన గాయాలైన విషయం తెలిసిందే.
హర్షవర్ధన్‌రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నాడు. తండ్రి రాంరెడ్డి భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు. గతేడాదే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనతో రెడ్డికాలనీలో విషాదం నెలకొంది.