Crime News: ఇంట్లో డబ్బు లేనప్పుడు.. తాళం వేయకూడదు కలెక్టర్‌..!

కలెక్టర్ ఇంటికే కన్నం వేసి, పైపెచ్చు ఆ అధికారికే సూచనలు చేశారు కొందరు దొంగలు. ఇంట్లో డబ్బులు లేనప్పుడు తాళం వేయడం ఎందుకంటూ చీటి రాసిపెట్టి మరీ వెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దేవాస్ నగరంలో ఒక డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో చోటుచేసుకుంది. 

Updated : 11 Oct 2021 16:28 IST

అధికారి ఇంటికే కన్నం వేసి, నీతులు చెప్పిన దొంగలు

భోపాల్: కలెక్టర్ ఇంటికే కన్నం వేసి, పైపెచ్చు ఆ అధికారికే సూచనలు చేశారు కొందరు దొంగలు. ఇంట్లో డబ్బులు లేనప్పుడు తాళం వేయడం ఎందుకంటూ చీటి రాసిపెట్టి మరీ వెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేవాస్ నగరంలో ఒక డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో చోటుచేసుకుంది.

భోపాల్‌కు దగ్గర్లోని ఈ దేవాస్ నగరంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసిస్తుంటారు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న త్రిలోచన్ గౌర్ కూడా అదే ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన భవనంలో ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన ఖాతేగావ్ సబ్‌ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. దాంతో గత 15 రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే అదును చూసి కొందరు దొంగలు త్రిలోచన్‌ ఇంటికి కన్నం వేశారు. అయితే అనుకున్నంత సొమ్ములేక నిరాశ చెందినట్టున్నారు. ఉన్నకొద్ది పాటి డబ్బును దొంగతనం చేసి, ఒక చీటిని వదిలేసి వెళ్లారు. ‘ఇంట్లో డబ్బు లేనప్పుడు, దానికి తాళం వేయకూడదు కలెక్టర్’ అని రాసిపెట్టి చక్కా జారుకున్నారు. ‘ఖాతేగావ్‌ ఎస్‌డీఎం త్రిలోచన్ గౌర్‌కు చెందిన ప్రభుత్వ నివాసంలో రూ.30 వేల నగదు, కొన్ని ఆభరణాల దొంగతనం జరిగింది. ఏ సమయంలో జరిగిందో కచ్చితమైన సమాచారం లేదు’ అంటూ అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. ఓ ప్రజాప్రతినిధి నివాసం, దేవాస్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లు అదే ప్రాంతంలో ఉండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని