Gold Theft: బాపట్లలోని బ్యాంకులో రూ.2 కోట్ల బంగారం మాయం

గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 5.8 కిలోల బంగారం మాయం అవడం కలకలం రేపింది

Published : 07 Sep 2021 01:14 IST

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 5.8 కిలోల బంగారం మాయమవడం కలకలం రేపింది. బ్యాంకులో అటెండర్‌గా పని చేసే సుమంత్ రాజు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ బంగారం చోరీ చేస్తున్నట్లు తేల్చారు. ఈ నెల 2న బ్యాంకులో ఆభరణాల ఆడిటింగ్ జరిగింది. అదే రోజు సుమంత్ సెలవు పెట్టాడు. ఆడిటింగ్‌లో బంగారు ఆభరణాలు మాయం అవడం.. సుమంత్ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై విచారణ ప్రారంభించిన పోలీసులు సుమంత్ రాజుకు సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు అధికారులతో పాటు స్ట్రాంగ్ రూంలోకి తరచూ వెళ్లే సుమంత్ వారి కళ్లు గప్పి ఆభరణాలు తస్కరించేవాడని గుర్తించారు. బ్యాంకు నుంచి చోరీ చేసిన బంగారం విలువ రూ. 2.2 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చోరీ చేసిన బంగారాన్ని సుమంత్‌ ఓ ప్రవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు సమాచారం. బంగారం మాయమైన విషయం బయటకు తెలియడంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తాము తాకట్టు పెట్టిన ఆభరణాలు పోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ఎక్కడ ఉందో గుర్తించామని ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు వారికి నచ్చజెప్పారు. చోరీపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు