Crime News: అత్యాచారం చేసి.. తల నేలకేసి కొట్టి వివాహిత హత్య

ఓ వివాహితపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడి.. ఆపై ఆమె తల నేలకేసి కొట్టి హతమార్చిన పైశాచికం బుధవారం నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితులిద్దరిలో ఒకరు.. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు. మరోవ్యక్తి.. భార్యతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు.

Updated : 23 Sep 2021 08:37 IST

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల దాష్టీకం

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఓ వివాహితపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడి.. ఆపై ఆమె తల నేలకేసి కొట్టి హతమార్చిన పైశాచికం బుధవారం నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితులిద్దరిలో ఒకరు.. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు. మరోవ్యక్తి.. భార్యతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు. నల్గొండ మండలంలో మద్యం మత్తులో జరిగిన ఈ దారుణం గురించి గ్రామీణ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలివి. ఓ గ్రామానికి చెందిన వివాహిత (54) భర్తతో కలిసి గ్రామంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహమైంది. ఆమె బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, అతడి స్నేహితుడు కుమ్మరి పుల్లయ్య అటకాయించారు. నోరు మూసి లింగయ్య ఇంట్లోకి లాక్కెళ్లారు. వివస్త్రను చేశారు. దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తలను నేలకేసి కొట్టి..  పిడిగుద్దులు గుద్ది ఆమెను హతమార్చారు. మెడలోని బంగారు గొలుసు, గాజులు, చెవి కమ్మలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. గొడవ జరుగుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడికి వచ్చి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులిద్దరూ 40 ఏళ్ల లోపు వారు. వినాయక నిమజ్జనం జరిగిన ఆదివారం నుంచి మద్యం తాగి గ్రామంలో జులాయిగా తిరుగుతున్నారని పోలీసులకు గ్రామస్థులు తెలిపారు. రెండేళ్ల నుంచి కాపురంలో గొడవలు రావడంతో లింగయ్య భార్య కొంత కాలంగా పుట్టింట్లో ఉంటున్నారు. కుమ్మరి పుల్లయ్య.. భార్యను ఏడేళ్ల క్రితం హత్య చేసి నెల రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని