Cyber Crime: యాప్‌ల పేరిట రూ.కోట్లు టోకరా

నకిలీ యాప్‌లతో సామాన్యులను దోచుకునే ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారికి సంబంధించిన 23 బ్యాంకు ఖాతాల్లోని రూ.62.5 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. బుధవారం కడప జిల్లా పోలీసు

Published : 07 Oct 2021 09:28 IST

ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని రూ.62.5 కోట్లు ఫ్రీజ్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: నకిలీ యాప్‌లతో సామాన్యులను దోచుకునే ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారికి సంబంధించిన 23 బ్యాంకు ఖాతాల్లోని రూ.62.5 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. బుధవారం కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్‌ విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. ‘‘మేకింగ్‌ మనీ, ఆర్‌సీసీ యాప్‌ల పేరిట బాధితుల సెల్‌ఫోన్లకు పెద్ద మొత్తంలో లింకులు పంపారు. వాటిపై క్లిక్‌ చేసి పెట్టుబడి పెడితే అధిక కమీషన్‌ పొందవచ్చని నమ్మించగా... చాలామంది ఆశపడ్డారు. తాము స్వయంగా, తమకు తెలిసిన వారితోనూ పెట్టుబడులు పెట్టించారు. ఆ డబ్బులను సైబర్‌ నేరగాళ్లు వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఆ డబ్బులను క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చుకున్నారు. ఇలా కడప జిల్లాలో నాలుగు కేసుల్లో సుమారు వంద మంది రూ.11 కోట్లు మోసపోయారు. ఇతర ప్రాంతాలన్నీ కలుపుకొంటే రూ.62.5 కోట్లు కోల్పోయారు’ అని ఎస్పీ వివరించారు. తమిళనాడులోని నామక్కల్‌కు చెందిన గోకుల్‌ వేందన్‌(28), ఈరోడ్‌కు చెందిన మురుగానందన్‌(50)లు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కడప ఎర్రముక్కపల్లెకు చెందిన గౌస్‌బాషా సైబర్‌ నేరానికి గురైనట్లు ఫిర్యాదు చేశారు. అతని స్నేహితుడు దండు నాగచైతన్య రూ.99,980 మోసపోయినట్లు తెలిసిందన్నారు. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ పోలీసులు సైతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారు. పీటీ వారంట్‌ ద్వారా కడపకు తీసుకొచ్చి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని