Road Accident: నల్గొండ జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముల్యాలమ్మగూడెం శివారులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు.

Updated : 19 Sep 2021 15:43 IST

కట్టంగూర్‌: నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మ గూడెం శివారులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలం అయ్యపురాజుపాలెంకు చెందిన కదిరి గోపాల్‌రెడ్డి (31) రాజస్థాన్‌ రాష్ట్రంలో మైనింగ్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. భార్య రచన(31), కూతురు రియాన్సితో అక్కడ 9ఏళ్లుగా నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా రాష్ట్రంలో ఉద్యోగం రావడంతో రాజస్థాన్‌లోని ఉద్యోగానికి రాజీనామా చేసి తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి అంతా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. కట్టంగూరు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ముందున్న కంటైనర్‌ లారీని బలంగా ఢీకొని.. ఆపై రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపాల్‌రెడ్డి, ప్రశాంత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రచన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. చిన్నారి రియాన్సీ స్వల్పగాయాలతో చికిత్స పొందుతోంది.

మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

చెట్టు ఢీకొట్టిన కారులో రచన, రియాన్సీ ఇరుక్కుపోయారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంతో ఈ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు బయలుదేరిన జంగం శివప్రసాద్‌ (23), రోమాల వినయ్‌(21)లు ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జంగం శివప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. వినయ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వీరిద్దరూ కారులో సూర్యాపేటలోని ఓ ఆశ్రమంలో నిర్వహిస్తున్న రుద్రాభిషేకానికి హాజరవుతున్నారు. సీఐ నాగదుర్గా ప్రసాద్‌, ఎస్సై శివప్రసాద్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని