
Crime News: దొంగ స్వాములకు దేహశుద్ధి.. ఇద్దరి అరెస్టు
యాదాద్రి : యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో అయ్యప్ప మాలధారణలో ప్రజలను మోసం చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఇద్దరిని పట్టుకుని దేహశుద్ది చేసి గ్రామపంచాయతీ కార్యాలయంలో బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం అయ్యప్ప వేషధారణలో ఉన్న ఇద్దరు గ్రామానికి వచ్చి కిరాణా షాపులో మహిళను కలిశారు. ఆమెకు దోషం ఉందని నమ్మబలికి ఒక తాయత్తు కట్టారు. ఆమె మైకంలోకి జారుకున్న తర్వాత షాపులో ఉన్న నగదు, కిరాణా సామగ్రి తీసుకుని పరారయ్యారు. ఈరోజు ఉదయం మళ్లీ అయ్యప్ప మాలధారణలో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమందించి గ్రామ పంచాయితీ కార్యాలయంలో బంధించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.