Crime News: విశాఖ బిల్డర్‌.. విజయవాడలో హత్య

విశాఖ నగరానికి చెందిన పీతల అప్పలరాజు అలియాస్‌ రాజు (47) విజయవాడలో హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఎంవీపీకాలనీకి చెందిన అప్పలరాజు విజయవాడకు వెళ్లి బిల్డర్‌గా ఎదిగారు.

Updated : 02 Nov 2021 07:02 IST

భిన్న కోణాల్లో పోలీసుల విచారణ

విజయవాడ, ఎం.వి.పి.కాలనీ(విశాఖ), న్యూస్‌టుడే : విశాఖ నగరానికి చెందిన పీతల అప్పలరాజు అలియాస్‌ రాజు (47) విజయవాడలో హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఎంవీపీకాలనీకి చెందిన అప్పలరాజు విజయవాడకు వెళ్లి బిల్డర్‌గా ఎదిగారు. అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ కృష్ణా హోటల్‌ కూడలిలో ఆర్‌.పి. కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో కార్యాలయం నడుపుతున్నారు. రాజుకు భార్య ఉమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌ ఎంబీఏ చదువుతున్నారు. కుమార్తె రేష్మకు ఆగస్టులో విశాఖలోనే వివాహం చేశారు. సుమారు మూడేళ్ల క్రితం భార్య, పిల్లలను తీసుకుని ఎంవీపీ సెక్టారు-9లో సొంతింటికి వచ్చి అక్కడే ఉంచారు. తాను విజయవాడలోనే ఉంటూ భవన నిర్మాణ కాంట్రాక్ట్‌లు చేస్తున్నారు. దసరా పండగకు విశాఖకు వచ్చిన అప్పలరాజు ఐదురోజుల క్రితమే విజయవాడకు వెళ్లగా..ఇంతలోనే హత్యకు గురవడంతో బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. 

ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో: అప్పలరాజు, అతడి వద్ద పనిచేసే సాయికుమార్‌ ఒకే భవనంలో అద్దెకు ఉంటున్నారు. బిల్డర్‌ పై అంతస్తులో, సాయికుమార్‌ తన కుటుంబంతో కలిసి కింది ఫ్లోర్‌లో ఉంటున్నారు. బిల్డర్‌ వద్దే పనిచేసే మరో వ్యక్తి వెంకటేష్‌ సోమవారం ఉదయం వారి వద్దకు వచ్చారు. అప్పలరాజు ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని సాయికుమార్‌తో అన్నారు. దీంతో పైకి వెళ్లి చూడగా, బిల్డర్‌ హత్య వెలుగుచూసింది. 


ఇంతకీ ఏమై ఉండొచ్చు..

అప్పలరాజు హత్య కేసును భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అతడికి వాంబేకాలనీలో ఓ యువతితో సన్నిహిత సంబంధం ఉందని తెలియడంతో అదేమైనా హత్యకు కారణమా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. మరో వైపు తన కుటుంబాన్ని విజయవాడ నుంచి ఎందుకు విశాఖపట్నంకు తరలించారనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా విజయవాడ విశాలాంధ్ర కాలనీలో ఓ స్థలం కొనుగోలు విషయంలో కొద్ది మేర వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుండగా ఆయా వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. మృతుడి చరవాణిలోని రికార్డులు, సమీపంలోని మద్యం దుకాణం, ఇతర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని నున్న సీఐ హనీష్‌బాబు తెలిపారు. కృష్ణా హోటల్‌ సెంటరులో నివాసముంటున్న మృతుడి తోడల్లుడు దుర్గారావు, మరదలు రాజీ.. ఘటనా స్థలానికి  వచ్చారు. బిల్డర్‌ మెడలో బంగారు గొలుసు, చేతికి ఉండాల్సిన రెండు ఉంగరాలు లేవని పోలీసులకు చెప్పడంతో.. ఎవరైనా ఆగంతకులు నగలు కోసం హత్య చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హత్యోదంతంతో పెద్ద సంఖ్యలో బిల్డర్లు, పరిచయస్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం సమయానికి అతడి కుటుంబ సభ్యులు నగరానికి చేరుకున్నారు. జీజీహెచ్‌లో ఉంచిన  భౌతిక కాయాన్ని చూసి వారు కన్నీరు మున్నీరయ్యారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని