
Nagpur: ప్రియుడి కోసం గ్యాంగ్‌రేప్ నాటకం.. పోలీసులకు చెమటలు పట్టించిన యువతి
నాగ్‌పుర్: ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం వెయ్యి మంది పోలీసులను అలర్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, కావాలనే నాటకమాడిందని గుర్తించారు. బాయ్‌ఫ్రెండ్‌ను దక్కించుకునేందుకే ఈ నాటకమాడిందని తెలుసుకొని విస్తుపోయారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గ్యాంగ్‌రేప్ కట్టుకథ వ్యవహారం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది.
చిఖ్కాలీ ప్రాంతంలో తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని సోమవారం ఉదయం 11 గంటలకు సీతాబుల్దీ పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ క్లాస్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ అడ్రస్ అడిగిన వ్యాన్‌లోని ఇద్దరు.. తనను నిర్బంధించి చిఖ్కాలీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. సున్నితమైన అంశం కావడంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు.. వెంటనే 1000 మంది పోలీసులతో కూడిన 40 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు ప్రారంభించాయి. కమిషనర్ అమితేష్ కుమార్, అడిషనల్ సీపీ సునీల్ ఫులారీతో సహా ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక దృష్టిసారించారు.
పోలీసులు ఆరు గంటలపాటు శ్రమించి సుమారు 250 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. స్నేహితులు, బంధువులు సహా 50 మందిని ప్రశ్నించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. ఆరోజు ఉదయం ఆమె బస్సులో, బైక్‌పై తిరిగినట్లు గుర్తించారు. దీంతో సదరు యువతిని గట్టిగా ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. కావాలనే గ్యాంగ్‌రేప్ నాటకమాడినట్లు సదరు యువతి ఒప్పుకొంది. తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడానికే ఈ డ్రామా ఆడినట్లు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.