Crime News: దివ్యాంగురాలిపై వైకాపా నాయకుడి అత్యాచారం

విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగురాలిపై వైకాపా నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. సీలేరుకు చెందిన దివ్యాంగురాలి(30)ని వివాహమైన కొద్ది నెలలకే భర్త వదిలేశాడు.

Published : 23 Sep 2021 07:27 IST

సీలేరు, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగురాలిపై వైకాపా నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. సీలేరుకు చెందిన దివ్యాంగురాలి(30)ని వివాహమైన కొద్ది నెలలకే భర్త వదిలేశాడు. ఆమె తల్లి వద్దే ఉంటూ స్థానికంగా వ్యాపారం చేసుకుంటోంది. వారం క్రితం బాధితురాలి తమ్ముడు జబ్బుపడగా.. తల్లి విజయనగరానికి తీసుకెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితురాలు సోమవారం అర్ధరాత్రి ఆరుబయట ఉన్న మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడే కాపుకాసిన వైకాపా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నాళ్ల వెంకటరావు ఆమెపై దాడిచేసి చున్నీతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించి, అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లికి విషయం తెలియడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 376, దివ్యాంగుల సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. వెంకటరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


అత్యాచార నిందితుడిపై చర్యలేవి: వంగలపూడి అనిత

ఈనాడు, అమరావతి: అత్యాచార కేసుల్లో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకుని.. కిందిస్థాయిలోని కొందరు వైకాపా నేతలు ఆడబిడ్డల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ‘విశాఖపట్నం జిల్లాలో దివ్యాంగురాలిపై వైకాపా నేత వెంకటరావు అత్యాచారానికి పాల్పడితే.. ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. శాంతిభద్రతల అమల్లో ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమ’ని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని